: 2012లో నా జీవితంలో చోటుచేసుకున్న సమస్య 'ప్రత్యూష'కు నాంది పలికింది!: కథానాయిక సమంత
2012లో సంభవించిన ఘటన తన ఆలోచనలను మార్చివేసిందని సినీ నటి సమంత తెలిపింది. 'మేము సైతం' కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను బాగా డబ్బున్న కుటుంబం నుంచి రాలేదని చెప్పింది. లోయర్ మిడిల్ క్లాస్ లో ఉన్నప్పటికీ తన తల్లి పేదరికాన్ని ఏనాడూ సమస్యగా భావించలేదని తెలిపింది. అంత లేమిలో కూడా తన తల్లి ఆపన్నులకు సహాయం చేసేదని, తనను కూడా అలా చేయమని చెప్పేదని సమంత చెప్పింది. సినిమా హీరోయిన్ అయిన తరువాత మూడేళ్లపాటు ఆఫర్లు వెల్లువెత్తడంతో, సంపాదనలో పడిపోయానని చెప్పింది. 2012లో తన జీవితంలో చోటుచేసుకున్న సంఘటనతో మూడు నెలలపాటు తీవ్ర నిరాశలో కూరుకుపోయానని తెలిపింది. అప్పుడు తానేం చేస్తున్నానని ఆలోచించానని, తాను జీవిస్తున్న విధానం సరైనదేనా అని అవలోకనం చేసుకున్నానని సమంత చెప్పింది. అప్పుడే తాను ఉన్నా లేకున్నా తన తల్లి చెప్పిన మాట మాత్రం బతకాలని భావించానని, అందుకే ప్రత్యూష ఫౌండేషన్ ను ప్రారంభించానని, దాని ద్వారా చేతనైనంత సాయం చేస్తున్నానని సమంత తెలిపింది.