: పెళ్లయిన పది రోజులకే నగలు, డబ్బుతో ఉడాయించిన పెళ్లికూతురు!
గుజరాత్ లో సరికొత్త ఘరానామోసం బయటపడింది. ఇన్నాళ్లూ చిన్నాచితకా దొంగతనాలు చేస్తూ వచ్చిన అన్నాచెల్లెళ్లు రూట్ మార్చి వరుడికి ఝలక్కిచ్చారు. వివరాల్లోకి వెళ్తే...అహ్మదాబాద్ లోని ఓ మ్యారేజ్ బ్యూరోను సుధాకర్ అనే యువకుడు సంప్రదించి తన చెల్లి యోగితకి మంచి వరుడ్ని చూడాలని ఫోటోలిచ్చాడు. అదే సమయంలో అమర్ వాడీలోని ఆదర్శ్ అపార్ట్ మెంట్స్ కు చెందిన రాజ్ పుత్ కు పెళ్లి సంబంధాలు చూసే పనిలో అతని అంకుల్ డాక్టర్ రమేష్ రాజ్ పుత్, యోగిత ఫోటోను చూశారు. అమ్మాయి లక్షణంగా ఉందని కుటుంబ సభ్యుల వివరాలు తెలపాలని మ్యారేజ్ బ్యూరోను అడగగా, వారు ఆమె వివరాలు ఇచ్చారు. దీంతో వారు సుధాకర్ ఇంటికి వెళ్లారు. యోగితను చూసి కుటుంబ సభ్యుల వివరాలు అడుగగా తామిద్దరమేనని, తమకు ముందు వెనుక ఎవరూ లేరని చెప్పడంతో 'కుటుంబంతో ఏముందిలే!' అని భావించి సెప్టెంబర్ 7న అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. సరిగ్గా పదిరోజులు ఆ ఇంట్లో తిరిగిన యోగిత పదకొండో రోజున వివాహం సందర్భంగా తనకు పెట్టిన నగలు, ఇంట్లో ఉన్న లక్ష రూపాయలు పట్టుకుని ఉడాయించింది. దీంతో వారు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసిన పోలీసులు, యోగిత ఉత్తుత్తి పెళ్లిళ్లు చేసుకుంటుందని, గతంలో ఇలాగే ముగ్గురిని వివాహం పేరుతో బోల్తాకొట్టించిందని ట్విస్ట్ ఇచ్చారు.