: అమెరికాలో దుండగుడి కాల్పులు.. నలుగురి మృతి
అమెరికాలో మరోసారి గన్ గర్జించింది. శుక్రవారం రాత్రి ఓ షాపింగ్‌మాల్‌లో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్టు వాషింగ్టన్ స్టేట్ పోలీసులు ట్విట్టర్లో పేర్కొన్నారు. సియాటెల్‌కు 105 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్లింగ్టన్లోని కాస్కేడ్ మాల్లో ఈ దుర్ఘటన జరిగినట్టు తెలిపారు. దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా మరికొందరు గాయపడినట్టు తెలుస్తోంది. కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆగంతుకుడి కోసం ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.