: ప్రభుత్వం చెప్పినా సెలవివ్వని స్కూల్... 40 మంది విద్యార్థులతో నడుములోతు నీటిలో కూరుకున్న స్కూల్ బస్సు
భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవులిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోని ఓ పాఠశాల, చిన్నారుల ప్రాణాలను పణంగా పెట్టింది. కూకట్ పల్లి పరిధిలోని శుభోదయా కాలనీకి చెందిన రాఘవ కాన్సెప్ట్ స్కూల్ బస్సు ఈ ఉదయం 40 మంది చిన్నారులతో ప్రయాణిస్తూ, ధరణినగర్ ప్రాంతంలో వరదనీటిలో చిక్కుకుపోయింది. బస్సు ఇంజన్ లోకి నీరు చేరడంతో ఓ కాలనీ రోడ్డు మధ్యలోనే చిన్నారులతో సహా బస్సు నిలిచిపోయింది. దీంతో అందులోని పిల్లలు ఏడుపు లంఘించుకున్నారు. వెంటనే చుట్టు పక్కల స్థానికులు నడుములోతు నీటిలోకి దిగి, ఆ బస్సును నెట్టుకుంటూ కాస్తంత ఎత్తయిన ప్రాంతానికి చేర్చారు. ఇంత భారీ వర్షం, వరద నీటిలో స్కూలు తెరవడం, ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేయడంపై చర్యలు తీసుకోనున్నట్టు విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు.