: జీఎస్టీ కౌన్సిల్ తొలి సమావేశం కీలక నిర్ణయాలివే..!
వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం (ఏప్రిల్ 1) నుంచే జీఎస్టీ బిల్లుని అమలులోకి తీసుకురావాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటి నుంచి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ తొలి సమావేశం జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం ముగిసిన ఈ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను ఆయన వెల్లడించారు. పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, రెవెన్యూ అధికారులతో బిల్లు గురించి చర్చించినట్లు చెప్పారు. వచ్చేనెల 17, 18, 19వ తేదీల్లో రెండోసారి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరపాలని నిర్ణయించుకున్నట్లు అరుణ్‌జైట్లీ తెలిపారు. పన్నురేటు, శ్లాబ్‌లపై రెండో సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ నెల 30న కూడా జీఎస్టీ కౌన్సిల్ సమావేశమవుతుందని చెప్పారు. బిల్లు వల్ల చిరువ్యాపారులకు ఎదురయ్యే ఇబ్బందులపై కూడా చర్చించినట్లు తెలిపారు. రూ.20 లక్షల టర్నోవర్‌లోపు ఉన్నవారికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఆపై టర్నోవర్ ఉన్నవారందరికీ ఈ ట్యాక్స్ వర్తిస్తుందని తెలిపారు.