: వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయండి: సీఎం కేసీఆర్ ఆదేశం
తెలంగాణలో కురుస్తోన్న వర్షాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వర్షం వల్ల జరిగిన నష్టం మొత్తాన్ని వెంటనే అంచనా వేయాలని ఆయన ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో జరిగిన పంట నష్టం వివరాలు కూడా సేకరించాలని చెప్పారు. అధికారులు రూపొందించిన నివేదికను కేంద్రానికి పంపి, సాయాన్ని కోరతామని పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడటం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి బాధిత ప్రజలకు సహకారం అందించాలని కేసీఆర్ సూచించారు. మరోవైపు వర్షాల కారణంగా తీసుకోవాల్సిన చర్యలు, నష్టం తదితర అంశాలపై చర్చించడానికి హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, లక్ష్మారెడ్డి, రాష్ట్ర పోలీసులు, ప్రభుత్వ ఉన్నాతాధికారులు సమావేశమయ్యారు.