: వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులను తాడు సాయంతో కాపాడిన సిబ్బంది
గుంటూరు జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి క్రోసూరు మండలంలోని వూటుకూరు వాగు పొంగడంతో సుమారు 45 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు నీటిలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ వారిని కాపాడాలంటూ జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేను అప్రమత్తం చేయడంతో చివరికి కలెక్టర్ సిబ్బందిని పంపి వారిని కాపాడారు. మొదట వారిని కాపాడడానికి హెలికాప్టర్‌ను రంగంలోకి దించాలని భావించిన అధికారులు చివరికి తాడు సాయంతో వారిని బయటకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ కాంతిలాల్ దండే మీడియాతో మాట్లాడుతూ బస్సులోని ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు, వరద పరిస్థితులను తాము సమీక్షిస్తున్నట్లు తెలిపారు. మునగోడు, అవిశాయపాలెంలో ప్రాంతాల్లోనూ ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారని వారిని రక్షించేందుకు రెండు హెలికాఫ్టర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెడ్డిగూడెం, బెల్లంకొండ రైల్వేస్టేషన్లలో పల్నాడు, శబరి, రఫ్తీసాగర్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసిన అంశంపై ఆయన మాట్లాడుతూ.. రైలులోని ప్రయాణికులకు ఆహారం, తాగునీరు అందజేసినట్లు తెలిపారు. వర్షాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పనిచేస్తున్నాయని చెప్పారు.