: నాకైతే ఆశ్చర్యం అనిపించింది.. అసలీ మనిషికి కాస్త కూస్తయినా ఇంగ్లీషు వస్తుందా అని?: చంద్రబాబుని ఎద్దేవా చేసిన జగన్
ఆనాడు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీ ఒక్కటై రాష్ట్రాన్ని విడగొట్టాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రం తీరుని నిరసిస్తూ ఏలూరులో ఆయన యువభేరీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆరోజు నుంచి ఈ రోజు వరకు హోదా కోసం తాము పోరాటాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ఐదేళ్లు అంటే, కాదు పదేళ్లు అని బీజేపీ నేతలు అన్నారని, వెంకయ్యనాయుడు ఆరోజు రాజ్యసభలో ఏపీ విభజనపై ఎన్నో మాటలు చెప్పారని ఆయన అన్నారు. ‘బీజేపీ అధికారలోకి వస్తే ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా సంజీవినీ అంటూ బీజేపీ, టీడీపీ నేతలు నాడు పొగిడారు. మరి ఎన్నికల తరువాత ఇప్పుడు ఆ నేతలు మాటలు మార్చి మాట్లాడుతున్నారు. హోదాపై జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధకలుగుతోంది. హోదాతో ఉద్యోగాలు వస్తాయని మాట్లాడిన వారే రెండున్నరేళ్లయినా ఏమీ చేయలేకపోతున్నారు. హోదా కోసం ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేశాం. పార్లమెంటు సాక్షిగా మన్మోహన్సింగ్ మాట ఇచ్చారు. అయినా కూడా హోదా సాధించలేకపోతున్నాం. హోదా వస్తుందని వెయ్యికళ్లతో ఎదురు చూశాం. అర్ధరాత్రి అరుణ్‌జైట్లీ మీడియా సమావేశం పెట్టి హోదా ఇవ్వబోమని స్పష్టం చేశారు’ అని జగన్ అన్నారు. ‘ఢిల్లీలో ప్రకటన చేయడమే ఆలస్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రకటనను స్వాగతిస్తున్నామని అన్నారు. నాకైతే ఆశ్చర్యం అనిపించింది.. అసలీ మనిషికి కాస్త కూస్తయినా ఇంగ్లీషు వస్తుందా? అనిపించింది. అంతటితో ఆగలేదు. హోదాతో లాభం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలోనూ మేము గట్టిగా అడిగాం.. హోదా అన్నది మీ అత్తగారి సొత్తా? అని అడగాలని చూశాం. మేము గట్టిగా అడుగుతున్నామని శాసనమండలిలో చంద్రబాబు ఇంకా ఆశ్చర్యంగా మాట్లాడారు. హోదా వల్ల ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లకు ఏం లాభం జరిగిందని అన్నారు.. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఐదేళ్లు కాదు, పదేళ్లు అన్నారు. మళ్లీ మొన్న హోదాతో ఏమొస్తుందని అన్నారు. మీకు న్యాయమేనా? అని అడుగుతున్నాను’ అని జగన్ వ్యాఖ్యానించారు.