: వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయండి... వారికి భోజనం పెట్టించండి: ఢిల్లీ నుంచి కేసీఆర్ ఆదేశం
తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నగర శివార్లలో పలు కాలనీల్లోని ఇళ్లు, అపార్ట్ మెంట్లలోకి నాలాల నుంచి మురుగునీరు చొచ్చుకుపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులపై శివార్లలోని లోతట్టు ప్రాంతల ప్రజలకు అవగాహన కల్పించాలని, వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించాలని జీహెచ్ఎంసీ సిబ్బందిని కేసీఆర్ ఆదేశించారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునగడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను గుర్తించి, వారికి మధ్యాహ్న భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. దీంతో కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్, జీడిమెట్ల, సురారం వంటి ప్రాంతాల్లో ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు మధ్యాహ్నభోజన సౌకర్యం ఏర్పాటు చేశారు.