: ఒడిశా తీరు ప్రపంచానికి చాటిన మరోఘటన... భుజాన భార్యను ఎక్కించుకుని ఆసుపత్రికి పయనం
ఇటీవలే భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకుని పది కిలోమీటర్ల దూరం వరకు మోసుకెళ్లిన ఒడిశా గిరిజనుడి ఉదంతం ఎందరినో కలచివేసింది. అదే తరహాలో నిండుచూలాలైన భార్యను భుజాన వేసుకుని నడుస్తూ ఒడిశాలోని రాయగడ జిల్లా కొసొహరిఖొల్లా గ్రామానికి చెందిన సొంబారు అనే వ్యక్తి తాజాగా వార్తల్లో నిలిచారు. గర్భవతి అయిన తన భార్య అనారోగ్యానికి గురికావడంతో సొంబారు 102, 108 లకు ఫోన్ చేశాడు. అంబులెన్సు కోసం ఎంతగా ఎదురు చూసినా రాకపోవడంతో బాధతో మెలితిరిగిపోతున్న భార్య అవస్థను చూడలేక, ఆమెను భుజాన వేసుకుని ఆసుపత్రికి నడక ప్రారంభించాడు. సుమారు కిలో మీటర్ దూరం ఇలా నడిచిన తరువాత అంబులెన్స్ రావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఫోటోలు మీడియాలో ప్రముఖంగా ప్రసారం కావడంతో మరోసారి ఒడిశా ప్రభుత్వ 'ఘనత'పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.