: హైదరాబాద్ లో సాయంత్రం వేళ వర్షం పడితే ఒక్కసారిగా వాహనాలు బయటకు రాకూడదు: ట‌్రాఫిక్ డీసీపీ
రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో హైదరాబాద్‌లో తలెత్తే ట్రాఫిక్ సమస్యపై డీసీపీ రంగనాథ్ హైదరాబాదీయులకు పలు సూచనలు చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన వర్షాలతో వాహనదారులు రోడ్లపై నరకయాతన అనుభవించిన విషయం తెలిసిందే. ఈ కష్టాల నుంచి బయటపడడానికి ఆయన పలు సూచనలు చేశారు. సాయంత్రం వేళ వర్షం పడితే ఉద్యోగులు ఒక్కసారిగా తమ ఆఫీసులు వదిలి బయటకు రాకూడదని చెప్పారు. పలు మార్గాల్లో రహదారులపై నీరు నిలిచి, ఇబ్బందులు ఏర్పడుతుండడంతో హైదరాబాద్‌లో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడుతుందని ఆయన గుర్తు చేశారు. ఇకపై నగరంలో ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉందో వివరాలు తెలుపుతూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా సూచనలిస్తామని డీసీపీ రంగనాథ్ చెప్పారు. తాము ఇచ్చిన సూచనల ఆధారంగా వాహనదారులు, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని కొనసాగించాలని సూచించారు.