: మరికాసేపట్లో సుప్రీంకోర్టులో కావేరి నదీజలాల వివాదం కేసు విచారణ.. ఇరు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ
మరికాసేపట్లో సుప్రీంకోర్టులో కావేరి నదీ జలాల వివాదం కేసు విచారణకు రానుంది. సుప్రీం తీర్పుపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమిళనాడుకు రేపటి నుంచి సెప్టెంబరు 30 వరకు రోజుకు మూడువేల క్యూసెక్కుల కావేరి నదీ జలాలు విడుదల చేయాలని కావేరి పర్యవేక్షక సమితి ఆదేశించింది. దీనిపై కర్ణాటక రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి విడుదలకు అవకాశాన్ని కల్పించబోమని హెచ్చరించారు. దీంతో కావేరి పర్యవేక్షక కమిటీ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో కర్ణాటక ప్రభుత్వం పిటిషన్ వేసింది. తమిళనాడుకి నీరిచ్చేది లేదని కర్ణాటక సుప్రీంకు తెలపనున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు విచారణ దృష్ట్యా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. కర్ణాటకలో సున్నిత ప్రాంతాల్లో ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది.