: గోప్యంగా ఉండాల్సిన సీఐడీ విచారణ వివరాలు ఓ పత్రికలో వచ్చాయి: అంబటి రాంబాబు ఆగ్రహం
తునిలో నిర్వహించిన కాపుల బహిరంగసభ కారణంగా అక్కడ ఆందోళనకారులు చేసిన విధ్వంసం కేసులో గుంటూరులో సీఐడీ అధికారులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రాంతానికి ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా వచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 6, 7 తేదీల్లో జరిగిన సీఐడీ విచారణ వివరాలు ఓ పత్రికలో వచ్చాయని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. గోప్యంగా జరిగిన విచారణ వివరాలు బయటికెలావచ్చాయని ప్రశ్నించారు. తుని విధ్వంసం కేసులో భూమనను ప్రభుత్వం అక్రమంగా ఇరికించాలని చూస్తోందని మరో నేత భాస్కరరెడ్డి ఆరోపించారు. తమ నేతని కేసులో ఇరికిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.