: తుని ఘటనపై న్యూస్ చానల్ యజమాని ఇంటరాగేషన్.. ఆసక్తికర అంశాలు వెల్లడి
తుని ఘటనపై సీఐడీ విచారణ లో నెంబర్ వన్ న్యూస్ చానెల్ యజమాని సుధాకర్ నాయుడు పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ‘చలో కాపునాడు’కు ముందుకు తనను కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కలిశారని, నాటి సభా వేదికపై ఒకరి తర్వాత మరొకరు మాట్లాడదామని చెప్పి, మొత్తం ఆయనే మాట్లాడారని ఆ విచారణలో సుధాకర్ నాయుడు చెప్పినట్లు సమాచారం. సభకు వచ్చినవారిని ముద్రగడ రెచ్చగొట్టారని, సభలో వినియోగించిన డ్రోన్ కెమెరాలను హైదరాబాద్ నుంచి తెప్పించారని సీఐడీ విచారణలో తెలిసింది. ఈ కెమెరాలను ముద్రగడ కుమారుడు తెప్పించారని, సభకు వచ్చిన వారిని రైల్వే ట్రాక్ వైపు ముద్రగడే తీసుకువెళ్లారని విచారణాధికారుల సమాచారం. కాగా, డ్రోన్ కెమెరాలు అందించిన వారికి కూడా నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.