: 2,000 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం దేశంలోకి గుట్టుచప్పుడు కాకుండా తరలించేశారు
దేశ చరిత్రలోనే అతిపెద్ద బంగారం అక్రమరవాణా గుట్టు రట్టయింది. 2000 కోట్ల రూపాయల విలువ చేసే 7000 కేజీల బంగారాన్ని రోడ్డు మార్గం ద్వారానూ, ఆకాశమార్గంలోను స్మగ్లర్లు భారత్ కు తరలించిన వైనాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు గుర్తించినట్టు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే... కొద్ది రోజుల కిందట ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ లో తనిఖీలు నిర్వహించిన అధికారులకు గువాహటి నుంచి ఢిల్లీకి వచ్చిన కార్గో విమానంలో 3.1 కోట్ల రూపాయల విలువ చేసే 10 కేజీల బంగారాన్ని గుర్తించారు. దీంతో దాని గుట్టు విప్పేందుకు రంగంలోకి దిగిన అధికారులు కార్గో రిజిస్ట్రేషన్ చిరునామాల ఆధారంగా గువాహటికి చెందిన ఓ వ్యాపారవేత్తను, ఢిల్లీలోని అతని అనుచరుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ విచారించగా షాక్ కు గురయ్యే వివరాలు వెల్లడయ్యాయి. ఇప్పటి వరకు వారు 7000 కేజీల బంగారాన్ని దేశంలోకి తరలించారు. గువాహటి ఎయిర్ పోర్టు నుంచి డొమెస్టిక్, కార్గో విమానాల ద్వారా రాజధాని ఢిల్లీ సహా ఇతర ప్రాంతాలకు బంగారాన్ని తరలించేవారు. అలా ఇప్పటి వరకు 617 దఫాలుగా 7 వేల కేజీల బంగారాన్ని తరలించారని వారు తెలిపారు. ఇప్పటి వరకు తాము ఛేదించిన స్మగ్లింగ్ కేసుల్లో అతిపెద్ద స్మగ్లింగ్ దందా ఇదేనని వారు చెప్పారు. ఈ స్మగ్లింగ్ లో విమానాశ్రయ అధికారులు, సిబ్బంది ప్రమేయంపై విచారిస్తున్నామని, త్వరలోనే వారిని కూడా ప్రశ్నిస్తామని వారు చెబుతున్నారు.