: పారా ఒలింపిక్స్‌లో విషాదం.. పోటీ జరుగుతుండగా సైక్లిస్ట్ మృతి
రియోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్ చివరి రోజు విషాదం చోటుచేసుకుంది. శనివారం నిర్వహించిన సైక్లింగ్ రోడ్ రేస్ సీ4-5 ఈవెంట్‌లో ఇరాన్ సైక్లిస్ట్ బహమాన్ గోల్బెరెన్‌జాద్(48) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. రేసు మధ్యలో ఉండగా ఆయన ఒక్కసారిగా కిందపడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రథమ చికిత్స అనంతరం క్రీడా గ్రామంలోని ఆస్పత్రికి తరలించేలోపే బహమాన్ ప్రాణాలు కోల్పోయాడు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా గుండెపోటుకు గురై అతను మృతి చెందినట్టు పారా ఒలింపిక్ కమిటీ తెలిపింది. బహమాన్ మరణవార్తను ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేసినట్టు పేర్కొంది. 55 ఏళ్ల పారా ఒలింపిక్ చరిత్రలో పోటీ జరుగుతుండగా ఓ అథ్లెట్ చనిపోవడం ఇదే తొలిసారి. 1980లో జరిగిన యుద్ధంలో కాలు కోల్పోయిన బహమాన్ కృత్రిమ కాలుతో 2002 నుంచి పోటీల్లో పాల్గొంటున్నాడు. బహమాన్ మృతితో క్రీడా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.