: విదేశీ కంపెనీలపై తగ్గిన మక్కువ... ఏకంగా 84 శాతం తగ్గిన భారత పెట్టుబడులు
భారత కంపెనీలు విదేశీ సంస్థలపై మోజును తగ్గించుకున్నాయి. గడచిన ఆగస్టులో భారత కంపెనీల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఏకంగా 84 శాతం తగ్గింది. గత సంవత్సరం ఇదే సమయంలో 2.47 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత సంస్థల విదేశీ పెట్టుబడి ఇప్పుడు కేవలం 399 మిలియన్ డాలర్లకు పడిపోయింది. వివిధ రకాల గ్యారెంటీ రూపంలో 97.14 మిలియన్ డాలర్లు, రుణాల రూపంలో 146.36 మిలియన్ డాలర్లు, ఈక్విటీ రూపంలో 155.56 మిలియన్ డాలర్లను భారత కంపెనీలు, ఇన్వెస్టర్లు విదేశాల్లో పెట్టారు. పల్లవ డ్వెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారుగా నిలిచి 21.75 మిలియన్లను మారిషస్, నెదర్లాండ్స్ ప్రాంతాల్లోని తన అనుబంధ సంస్థలకు తరలించింది. ఆ తరువాత డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్ సంస్థ 13.35 మిలియన్లను యూకేలోని జాయింట్ వెంచర్ సంస్థలో పెట్టగా, జనరల్ ఇన్స్యూరెన్స్ సంస్థ తన అనుబంధ సౌతాఫ్రికా యూనిట్ లో 11.9 మిలియన్లను, భారత్ పెట్రోరిసోర్సెస్ సంస్థ 15.15 మిలియన్లను విదేశాల్లో ఇన్వెస్ట్ చేశాయి.