: అత్యాచార బాధితురాలికి ఐక్యరాజ్యసమితి అరుదైన గౌరవం
ఒకప్పుడు కామాంధుల చేతిలో అత్యాచారానికి గురై, ఐఎస్ ఉగ్ర వాదుల సెక్స్ బానిసగా అవమానాలు ఎదుర్కొన్న ఇరాకీ యువతి ఐక్యరాజ్యసమితి నుంచి అరుదైన గౌరవాన్ని అందుకుంది. మానవ అక్రమ రవాణా నుంచి బయటపడిన వారి గౌరవార్థం నాదియా మురద్ బాసీ తాహ అనే 23 ఏళ్ల యువతిని ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది. మురద్ బాసీ ఇరాక్ లోని ఉత్తర పట్టణమైన సింజాక్ కు సమీపంలోని కోచో అనే గ్రామంలో నివసించేది. 2014 ఆగస్ట్ లో ఒక రోజు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మురద్ తాహను ఆమె నివాసం నుంచి అపహరించుకుపోయారు. మోసుల్ కు తీసుకెళ్లి అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారం జరిపి అనంతరం పలువురికి విక్రయించారు. ‘నాలాంటి వారు ఇంకా వేలాది మంది అక్కడ ఉన్నారు. వారందరూ బయటపడలేని పరిస్థితుల్లో నేను అక్కడి నుంచి తప్పించుకోవడం అదృష్టమే. యాజిడి యువతులు 3200 మంది అక్కడ లైంగిక బానిసలుగా పడి ఉన్నారు. వారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఐక్యరాజ్యసమితి వేదికగా జరిగిన కార్యక్రమంలో తాహ పిలుపునిచ్చారు.