: ఆ సంఘటన ప్రభావం నాపై చాలా ఉంది: ఎంఎస్ ధోనీ
2007 వరల్డ్ కప్ లో భారత్ నిష్క్రమించిన అనంతరం జరిగిన ఒక సంఘటనే తాను బెటర్ క్రికెటర్ గా మారడానికి కారణమని టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ ఎంఎస్ ధోనీ అన్నాడు. ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ‘ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ’ ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ధోనీ ఈ విషయాలను ప్రస్తావించాడు. వెస్టిండీస్ లో జరిగిన 2007 వరల్డ్ కప్ లో భారత్ నాకౌట్ దశలోనే టోర్నీ నుంచి వైదొలిగింది. అనంతరం, భారత్ చేరుకున్న టీం ఇండియాపై అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. అప్పుడు జరిగిన ఒక సంఘటనను ధోనీ గుర్తుచేసుకుంటూ.. ‘ఎయిర్ పోర్ట్ నుంచి నేను, సెహ్వాగ్ పోలీస్ వ్యాన్ లో అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు చీకటి పడుతోంది. మీడియా వాళ్లు మమ్మల్ని వెంబడించారు. మేము ఏదైనా నేరం చేశామా? ఉగ్రవాదులమా? అనే భావన ఆ సమయంలో నాకు కల్గింది. ఒక పోలీస్ స్టేషన్ దగ్గర కొంత సేపు ఆగాము. ఆ తర్వాత మా సొంత కార్లు రాగానే, ఎవరి కార్లలో వాళ్లము వెళ్లిపోయాం. ఈ సన్నివేశం నన్ను చాలా ప్రభావితం చేసింది. నేను బెటర్ క్రికెటర్ గా మారేందుకు ఎంతో దోహదపడింది’ అని ధోనీ చెప్పుకొచ్చాడు.