: మోహన్ బాబు ఆత్మీయుడు, గ్రేట్ ఆర్టిస్ట్: టి.సుబ్బరామిరెడ్డి
సినీ నటుడిగా 40 వసంతాలు పూర్తి చేసుకున్న డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారని టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబుకు ‘నవరస నట తిలక’ బిరుదుతో ఘనంగా సన్మానించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ బాబు కుమారులు, నటులు మంచు విష్ణు, మనోజ్ లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఎందరో ప్రముఖులను తాను సత్కరించానని అన్నారు. 'అవన్నీ ఒక ఎత్తు, మోహన్ బాబును సత్కరించడం మరో ఎత్తు. ఎందుకంటే, ఆయన ఆత్మీయుడు, గ్రేట్ ఆర్టిస్ట్' అని సుబ్బరామిరెడ్డి అన్నారు. నటుడిగా నలభై ఏళ్లు పూర్తి చేయడమనేది అంత చిన్న విషయం కాదన్నారు. విశాఖలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో దర్శకరత్న దాసరి నారాయణరావు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, శ్రీదేవి, జయప్రద, జయసుధ తదితర ప్రముఖులు పాల్గొననున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం, మంచు విష్ణు, మనోజ్ మాట్లాడుతూ, సుబ్బరామిరెడ్డిలా కళలను ప్రేమించే వారు మరొకరు లేరని, సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు నాడే తమ తండ్రికి ఈ బిరుదు ప్రదాన కార్యక్రమం జరుగుతుండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.