: బహిష్కృత బెలూచ్ నేతలకు భారత్ పౌరసత్వం ఇవ్వాలని చూస్తోంది!: పాక్ మీడియా ప్రత్యేక వార్తలు
పాకిస్థాన్ ను వీడి స్విట్జర్లాండ్ లో తలదాచుకున్న బెలూచిస్థాన్ నేత బ్రహుమ్దాగ్ బుగ్తీకి భారత్ పౌరసత్వం ఇస్తోందని పాక్ మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురించింది. సుదీర్ఘకాలం పాటు చర్చల అనంతరం బుగ్తీ భారత పౌరసత్వాన్ని పొందనున్నాడని జియో న్యూస్ వెల్లడించింది. బుగ్తీతో పాటు ఆయన అనుచరులైన షేర్ మహమ్మద్ బుగ్తీ, అజీజుల్లా బుగ్తీలను సైతం భారత్ అక్కునజేర్చుకోనుందని తెలిపింది. కాగా, బ్రహుమ్దాగ్ బుగ్తీ పాక్ లో నిషేధించబడ్డ బెలూచ్ రిపబ్లికన్ పార్టీ వ్యవస్థాపకుడు. తమ ప్రాంతానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని ఆయన ఉద్యమం లేవదీయగా, పాక్ సైన్యం ఉక్కుపాదంతో అణచివేసింది. దీంతో ఆయన ప్రస్తుతం స్విస్ లో ఉంటున్నారు. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని భావిస్తున్న ఇండియా, అందుకు బుగ్తీని వాడుకోవాలని చూస్తోందని, నరేంద్ర మోదీ స్వయంగా ఆయనకు పౌరసత్వం ఇచ్చేందుకు నిర్ణయించారని పేర్కొంది. గతంలో ఆయనకు స్విస్ ప్రభుత్వం పౌరసత్వం ఇవ్వాలని చూడగా, అందుకు పాక్ తీవ్ర అభ్యంతరం తెలిపి, ఆ ఆలోచన వెనక్కు పోయేలా చేసిందని తెలిపింది. 2006లో తన తాత అక్బర్ బుగ్తీ హత్యానంతరం ఆఫ్గనిస్థాన్ వెళ్లిన బుగ్తీ, అక్కడ ప్రభుత్వ అతిథిగా కొంత కాలం ఉండి, ఆపై తన కుటుంబం సహా అక్టోబర్ 2010లో స్విట్జర్లాండ్ వెళ్లారు. ఇక ఇప్పుడు ఆయన జనీవాలోని భారత రాయబార కార్యాలయంలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోనున్నారని, జర్మనీ, లండన్, నార్వే, స్వీడన్ తదితర దేశాల్లో ఉన్న 16 మంది బెలూచ్ నేతలూ ఇదే విధమైన దరఖాస్తులు అందించనున్నారని జియో న్యూస్ వెల్లడించింది.