: స్లీపర్ బస్సు, అందరూ నిద్రిస్తున్న వేళ ఘోరాతిఘోరం!


అది కావేరీ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు. హైదరాబాద్ నుంచి షిర్డీకి తిరుగుతూ ఉంటుంది. దాని రిజిస్ట్రేషన్ మాత్రం తమిళవాసులు అత్యధికంగా నివసించే పుదుచ్చేరి పేరిట ఉంది. అదే ఆ బస్సు ఎక్కిన వారికి శాపమైంది. వాస్తవానికి ఈ బస్సు కర్ణాటక పరిధిలో గంట సేపు కూడా ప్రయాణించదు. మహారాష్ట్ర దాటిన తరువాత హుమ్నాబాద్ మీదుగా జహీరాబాద్ వచ్చి తెలంగాణ పరిధిలోకి ప్రవేశిస్తుంది. రోజూ ఆగినట్టుగానే హుమ్నాబాద్ సమీపంలో అర్ధరాత్రి దాటిన తరువాత ఓ దాబా వద్ద బస్సు ఆగింది. కొందరు కిందకు దిగారు. మరికొందరు బస్సులోనే నిద్రిస్తున్నారు. ఆ సమయంలో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు రిజిస్ట్రేషన్ నంబర్ చూసిన కొందరు గుర్తు తెలియని కన్నడ ఆందోళనకారులు అది తమిళనాడు బస్సనుకొని నిప్పంటించినట్టు తొలుత వార్తలు రాగా, షార్ట్ సర్క్యూట్ దీనికి కారణమని అధికారులు తేల్చారు. ఈ దుర్ఘటనలో బస్సులోనే ఉన్న వారికి మంటలంటుకోగా విహాన్ అనే యువకుడు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్యపై సమాచారం అందాల్సివుంది. ఘటనలో బస్సు నామరూపాల్లేకుండా కాలిపోయింది. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, అధికారులు వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై తెలంగాణ సర్కారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సాయం అందించాలని కర్ణాటకను కోరింది.

  • Loading...

More Telugu News