: భువనగిరి సబ్జైలర్ శ్రీనివాసరావు ఆచూకీ లభ్యం.. ఖమ్మం ఆసుపత్రిలో ప్రత్యక్షమైన వైనం!
తనను అధికారులు వేధింపులకు గురి చేస్తూ, అకారణంగా బదిలీ చేశారంటూ నల్గొండ జిల్లా భువనగిరి సబ్జైలు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఆయన రాసిన లేఖను గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్స్టేషన్లో ఈ అంశంపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు ఆయన ఆచూకీని కనుగొన్నారు. భువనగిరిలో అదృశ్యమైన ఆయన ఖమ్మం జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రత్యక్షమయ్యారు. సదరు ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటూ కనిపించారు. శ్రీనివాసరావు తాను రాసిన లేఖలో తనను లక్సెట్టిపేట సబ్జైలుకి బదిలీ చేశారని, తనకు అక్కడ పనిచేయడం ఇష్టం లేదని పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై జైళ్ల శాఖ డీజీ వి.కె.సింగ్ స్పందిస్తూ, అవినీతికి పాల్పడ్డ కారణంగానే ఆయనను బదిలీ చేశామని చెప్పారు.