: ‘దేశంలోనే విశాఖ ఎంతో సుందరమైనది’.. రష్యా పెట్టుబడులకు స్వాగతం పలుకుతున్నామన్న చంద్రబాబు
రక్షణరంగ పరిశ్రమల ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు అనే అంశంపై ఈరోజు విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సదస్సు నిర్వహించారు. రష్యాకు చెందిన నౌకా నిర్మాణ పరిశ్రమ విశాఖలో ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలపై ఆయన ఆ దేశ ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రక్షణ రంగంలో రష్యా చాలా బలంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు బలోపేతమయ్యాయని ఆయన పేర్కొన్నారు. సాంకేతికత వినియోగంలో ఆ దేశం చాలా ముందుందని చంద్రబాబు అన్నారు. పెట్టుబడులకు ముందుకొస్తే అన్ని విధాలా సాయాన్ని అందిస్తామని తెలిపారు. ఏపీలో రష్యా పెట్టుబడులను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం సుదీర్ఘ తీరప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రమని ఆయన చెప్పారు. పర్యాటక అభివృద్ధికి కూడా రాష్ట్రం ఎంతో అనువైన ప్రాంతమని అన్నారు. దేశంలోనే విశాఖనగరం ఎంతో సుందరమైనదిగా ఆయన పేర్కొన్నారు.