: ఆసియాలోనే అతిపెద్ద కళాఖండం రామోజీ ఫిలిం సిటీ: మంత్రి తలసాని
ఆసియాలోనే అతిపెద్ద కళాఖండం రామోజీ ఫిలింసిటీ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. హైదరాబాద్‌లోని ప్రసిద్ధ రామోజీ ఫిలింసిటీలో 70 దేశాల నుంచి 2 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్న ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్‌పై ఈరోజు ఫిలింఛాంబర్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రామోజీ ఫిలింసిటీలో ఈనెల 24 నుంచి 27వరకు ఫిలిం కార్నివాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుందని తెలిపారు. రామోజీ ఫిలిం సిటీ ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని ప్రతినిధులు ఈ ఫిలిం కార్నివాల్‌ను ఇక్కడ నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలో పలు చిత్ర పరిశ్రమలు కూడా రామోజీ ఫిలింసిటీకి రానున్నాయని, పరస్పర సహకారానికి కార్నివాల్ ఉపయోగపడుతుందని తలసాని అన్నారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. టాలీవుడ్ అభివృద్ధికి తమ సర్కారు పలు కార్యక్రమాలు చేపడుతోందని తలసాని అన్నారు. వృద్ధ కళాకారులకు చిత్ర పరిశ్రమ ఇచ్చే పింఛన్లతో పాటు సర్కారు నుంచి కూడా పింఛన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం కళాకారులకు ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని సైతం చేబట్టే ఆలోచనలో ఉందని అన్నారు.