: అన్నా డీఎంకే సీనియర్ నేతపై వేటు... పార్టీ నుంచి బహిష్కరణ
అన్నా డీఎంకే సీనియర్ నేత నాథమ్ విశ్వనాథన్ పై వేటు పడింది. పార్టీ నుంచి బహిష్కరిస్తూ తమిళనాడు సీఎం, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన, పార్టీలో పలు కీలక పదవులను నిర్వహించారు. పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీ పదవి నుంచి, పార్టీ కమ్యూనికేషన్ గ్రూప్ నుంచి ఆయన్ని తొలగించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ఆయనను పార్టీ నుంచి తొలగించడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. కాగా, ఇటీవల ఆదాయపన్ను శాఖాధికారులు ఆయనకు సంబంధించిన ఆస్తులు ఉన్న నలభై ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ నేపథ్యంలోనే నాథమ్ విశ్వనాథన్ ను పార్టీ నుంచి తొలగించినట్లు పార్టీ వర్గాల సమాచారం.