: ఇదేమైనా కశ్మీరా? అసలు మనం భారతదేశంలోనే ఉన్నామా?: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న భూసేకరణ అంశంపై తాము సుప్రీంకోర్టు మెట్లెక్కనున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముంపు గ్రామమయిన వేమలఘట్ లో 50 రోజులుగా 144 సెక్షన్ విధించటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమైనా కశ్మీరా? అసలు మనం భారతదేశంలోనే ఉన్నామా? అని ఆయన వ్యాఖ్యానించారు. ముంపు ప్రాంతాల్లో విధించిన 144 సెక్షన్‌ను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై తాము ఇప్పటికే డీజీపీకి ఆదేశాలివ్వాలని కూడా కోరినట్లు ఉత్తమ్ చెప్పారు. భూసేకరణ అంశంపై తాము త్వరలో ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవనున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న భూసేకరణ రాజ్యాంగబద్ధంగా 2013 చట్టం ప్రకారమే జరగాలని గవర్నర్ ప్రభుత్వానికి సూచించాలని ఆయన కోరారు.