: కిం కర్తవ్యం... నేడు రాజమహేంద్రవరంలో కాపుల కీలక సమావేశం, హాజరుకానున్న దాసరి, చిరంజీవి!
కాపులను వెనుకబడిన వర్గాల్లో చేర్చాలన్న అంశంపై చంద్రబాబు ప్రభుత్వాన్ని మరింత ఒత్తిడి చేయడమే లక్ష్యంగా, అందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు నేడు కాపు జాయింట్ యాక్షన్ కమిటీ రాజమహేంద్రవరంలో ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 13 జిల్లాల కాపు సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నారు. సమావేశానికి కాపు నేత ముద్రగడ పద్మనాభం హాజరై, తన భవిష్యత్ కార్యాచరణ గురించి నేతలకు వివరించనున్నారు. ఈ రాష్ట్ర స్థాయి సమావేశాలకు ఏర్పాట్లన్నీ పూర్తి కాగా, కాపు నేతలు, మాజీ కేంద్ర మంత్రులు దాసరి నారాయణరావు, చిరంజీవిలతో పాటు పలువురు ప్రముఖులు, మాజీ అధికారులు హాజరు కానుండటంతో కాపు జేఏసీ కమిటీ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాపులతో పాటు తెలగ, ఒంటరి, బలిజ కులస్తులను బీసీల్లో చేర్చాలంటూ, కాపు నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.