: పవన్ కల్యాణ్... మా పార్టీ నేతలను విమర్శించే ముందు చరిత్ర తెలుసుకో!: బీజేవైఎం ఏపీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి
ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై బీజేపీ నేతలు వ్యూహం మార్చారు. దూకుడైన విమర్శలతో పవన్ కల్యాణ్ పై ఎదురు దాడిచేసేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా బీజేవైఎం ఏపీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ప్రసంగం వింటుంటే రచయితలు రాసిచ్చిన స్క్రిప్టు మర్చిపోయి మాట్లాడుతున్నట్టు ఉందని అన్నారు. 'సినిమాల్లో నటించి బ్లాక్ మనీ కూడగట్టుకుంటున్న పవన్ కల్యాణ్ కు కేంద్రం ఇచ్చిన నిధులు పాచి లడ్డూల్లా కనిపిస్తున్నాయా?' అని ఆయన ప్రశ్నించారు. "కావాలంటే 'పీఆర్పీ-2' పెట్టుకో, కానీ మా పార్టీ నేతలను విమర్శించే ముందు చరిత్ర తెలుసుకో" అని ఆయన పవన్ కల్యాణ్ కు హితవు పలికారు. 6 నెలలు పడుకుని ధ్యాననిద్ర చేస్తే పనికిరాదని, ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆయన సవాల్ విసిరారు. ఏపీకి కేంద్రం ఇస్తున్న నిధులపై చర్చకు సిద్ధమని ఆయన సవాలు విసిరారు. ఏపీకి ప్రత్యేకహోదా డిమాండ్ చిల్లర ఓట్లకే తప్ప, రాష్ట్రాభివృద్ధికి పనికిరాదని ఎద్దేవా చేశారు. అవంతి శ్రీనివాస్ ను గెలిపించుకుంటానన్న పవన్ కల్యాణ్ అంత శక్తిమంతుడైతే... అల్లు అరవింద్ ను గెలిపించి, చిరంజీవిని ఎందుకు సీఎంను చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు.