: యువకులను రెచ్చగొట్టి నేను పబ్బం గడుపుకోవాలా?: పవన్ కల్యాణ్
తనను అభిమానించే ఓ వ్యక్తి, జనసేన బహిరంగ సభకు వచ్చి మరణించాడంటే ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోవాలని జనసేనాని పవన్ కల్యాణ్ సూచించారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ, ఈ సంఘటన జరిగిన అనంతరం తనకు కనీసం నిద్రకూడా పట్టలేదని అన్నారు. పోరాడమంటూ అంతా తనకు సూచిస్తుంటారని, తాను పోరాటానికి దిగితే పరిస్థితులు ఇంతకంటే దిగజారిపోతాయని ఆయన అన్నారు. తాను కేవలం ఒక సభ పెడితేనే యువకుడి ప్రాణం పోయిందని, అదే తనను కలచివేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువకులని రెచ్చగొట్టి నేను పబ్బం గడుపుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు. నాతో నడిచే యువకుల జీవితాలతో ఆడుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజా సమస్యలు, ప్రత్యేకహోదాపై ఎలా పోరాటం చేయాలనే దానిపై తనకు ఒక ప్రణాళిక ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తానని ఆయన చెప్పారు.