: హైదరాబాద్ గురించి మాట్లాడితే అప్పట్లో నన్ను ఎగతాళి చేశారు: శాసనమండలిలో చంద్రబాబు
హైదరాబాద్లో ఏపీ శాసన సభ, మండలి సమావేశాలు ఇవే చివరివని తాము అనుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈరోజు శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడం ఎంతో హర్షదాయకమని ఆయన అన్నారు. హైదరాబాద్ విషయంలో తనను ఇదేనా అభివృద్ధి? అని విమర్శించినవారు కూడా ఉన్నారని ఆయన అన్నారు. తాను హైదరాబాద్ గురించి మాట్లాడితే అప్పట్లో తనను ఎగతాళి కూడా చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ చూస్తే ఇప్పటికీ తనకు ఆనందంగా ఉంటుందని ఆయన అన్నారు. అమరావతిని కూడా అద్భుతంగా నిర్మిస్తామని పేర్కొన్నారు. తనను పొగిడే వారు పొగుడుతున్నారని.. విమర్శించే వారు విమర్శిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో కరెంటు కోత లేకుండా చేసినట్లు చెప్పారు. కొన్ని సమస్యలు వారసత్వంగా వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఇబ్బంది లేకుండా చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. ‘వెలుగొండ ప్రాజెక్టుకు నేనే శంకుస్థాపన చేశా. దాన్ని పూర్తి చేసే బాధ్యత నాదే. ఆ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం జిల్లాకు నీటి కొరత ఉండదు. ఏపీలో కరవు నివారణకు ఎన్నో చర్యలు తీసుకున్నాం. ప్రకాశం జిల్లాలో లభించే పాలు ఎక్కడా దొరకవు. రాష్ట్రంలో ప్రవహించే నదుల నీరును సక్రమంగా ఉపయోగించుకుంటాం. రైతులకు ఎటువంటి కష్టాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రాన్ని కరవు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతాం’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.