: ఇకపై సభలు నిర్వహించబోను: పవన్ కల్యాణ్
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించిన అనంతరం చోటుచేసుకున్న అపశ్రుతిలో పవన్ అభిమాని వెంకటరమణ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. కాజులూరు మండలం కుయ్యూరులోని వెంకటరమణ ఇంటికి ఈ రోజు పవన్ కల్యాణ్ వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తన అభిమాని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటానని చెప్పారు. వెంకటరమణ చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే తాను సభలు ఏర్పాటు చేయడం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఇకపై సభలు నిర్వహించబోనని స్పష్టం చేశారు. హోదా కోసం ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధపడాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. వారు పోరాటం చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులకు చేతకాకపోతే తానే పోరాటానికి దిగుతానని తెలిపారు.