: రాష్ట్ర విభజన సమయంలోనూ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదు: సీఎం చంద్రబాబు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈరోజు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలోనూ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదని ఆయన అన్నారు. అసెంబ్లీ స్పీకర్ పట్ల అగౌరవంగా ప్రవర్తించడం సరికాదని, అసెంబ్లీ ఉన్నది కొట్టుకోవడానికి కాదని ఆయన హితవు పలికారు. స్పీకర్ స్థాయిని దిగజార్చేలా వైసీపీ ప్రవర్తించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ని ముట్టడించడానికి కాదు సమావేశాలు జరిపేది అని ఆయన అన్నారు. ‘ప్రజాసమస్యల పరిష్కారం చేస్తామనే ఉద్దేశంతో ప్రజలు మనల్ని ఇక్కడికి పంపించారు. హద్దులు దాటి గొడవ చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. నేనెప్పుడూ అసెంబ్లీలో ఇటువంటి ప్రవర్తన చూడలేదు. వైసీపీ నేతలు మొదటి రోజే సభకు ఆలస్యంగా వచ్చారు. మేం ఎప్పుడూ క్రమశిక్షణ తప్పలేదు. మేము ప్రతిపక్షంలో స్పీకర్ మైకు ఇవ్వకపోయినా సంయమనంగా ఉన్నాం. అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేలా ప్రవర్తించాలి. చర్చిస్తే దేనికైనా సమాధానం చెబుతాం. వైసీపీ ప్రవర్తనను ఖండిస్తున్నాం. రెండు రోజులుగా సభ జరిగిన తీరు విచారకరం’ అని ఆయన వ్యాఖ్యానించారు.