: న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో అందర్నీ ఆకట్టుకున్న యాసిడ్ బాధిత యువతి
న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో ధైర్యంగా ర్యాంప్ వాక్ చేసిన యాసిడ్ బాధిత యువతి అందర్నీ ఆకట్టుకుంది. అంతర్జాతీయ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేయాలంటే అందచందాలతో పాటు, చక్కని నడక, ఆత్మస్థైర్యం, పట్టుదల, బెరుకు లేకుండా నలుగురిలోకి వెళ్లగలిగే ధైర్యం వంటివెన్నో కావాలి. భారతీయ ఫ్యాషన్ డిజైనర్ అర్చనా కొచ్చర్ రూపొందించిన దుస్తులు ధరించి, న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో ధైర్యంగా అడుగులో అడుగేసుకుంటూ నడిచిన రేష్మా ఖురేషీ (19) అందర్నీ ఆకట్టుకుంది. ఒకరకంగా చెప్పాలంటే, ఫ్యాషన్ లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనే అనాలి. రేష్మా ఖురేషీ బావ, అతని స్నేహితులు ఆమెపై యాసిడ్ దాడి చేయడంతో ఆమె ముఖం కాలిపోయింది. ఒక కన్ను పూర్తిగా మూసుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏమాత్రం నిరాశా నిస్పృహలకు లోను కాకుండా, తానేమీ తప్పు చేయలేదని, తనకు కూడా ఇతరుల్లా జీవించే హక్కు ఉందని, యాసిడ్ దాడి బాధితులు, కేవలం ఇల్లు, ముసుగులకే పరిమితమైపోకూడదని సందేశమిస్తూ, ధైర్యంగా ర్యాంప్ వాక్ చేసింది. ఈ అనుభవం తనకు చాలా గొప్ప అనుభవమని, జీవితంలో మరింత ముందుకు వెళ్లేందుకు సరిపడా ధైర్యాన్నిచ్చిందని రేష్మ అభిప్రాయపడ్డారు.