: పులులను రక్షించడానికి వేట కుక్కలను రంగంలోకి దించనున్న మధ్యప్రదేశ్ పోలీసులు
పులులను రక్షించడానికి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పోలీసులు శునకాలని రంగంలోకి దించనున్నారు. పులులు అత్యధికంగా ఉండి, 2010 వరకు ‘టైగర్ స్టేట్’గా పిలవబడిన మధ్యప్రదేశ్‌లో 2012 నుంచి ఇప్పటి వరకు మొత్తం 39 పులులు వేటగాళ్ల బారిన పడి బలైపోయాయి. దీంతో వాటిని వేటగాళ్ల నుంచి రక్షించుకునే క్రమంలో వేట కుక్కలను ఉపయోగించాలని మధ్యప్రదేశ్ పోలీసులు నిర్ణయించుకున్నారు. పలు నేరాలు చేసిన వారిని పసిగట్టడానికి, డ్రగ్స్ ను పట్టుకోవడానికి పోలీసులు స్నిఫర్ డాగ్స్‌కి శిక్షణ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఇప్పుడు పులుల సంరక్షణ చేపట్టడానికి శునకాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. బెల్జియం నుంచి నాలుగు జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన శునకాలను పులుల సంరక్షణ కోసం తీసుకొస్తున్నారు. ఈ కుక్కలు వేటగాళ్లను పట్టుకునేందుకు ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు. దేశంలో అన్నింటికన్నా పులుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రం కర్ణాటక. ఆ రాష్ట్రంలో 408 పులులు ఉన్నాయి. 340 పులులతో ఉత్తరాఖండ్ రెండో స్థానంలో ఉండగా, 308 పులులతో మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉంది.