: నేడు 'ఐసీజీఎస్ సారథి' జాతికి అంకితం... ప్రత్యేకతలివే!
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 100 మీటర్ల పొడవైన కోస్ట్ గార్డ్ షిప్ 'ఐసీజీఎస్ సారథి' నేడు జాతికి అంకితం కానుంది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ లు ఈ షిప్ ను భారత కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర సింగ్ కు అధికారికంగా అందించనున్నారు. గోవాలోని వాస్కోడగామా షిప్ యార్డులో తయారు చేస్తున్న సారథి నౌకల్లో ఇది మూడవది. ప్రపంచ స్థాయి సాంకేతిక, నావిగేషన్, సమాచార వ్యవస్థలతో పాటు అధునాతన రాడార్, సెన్సర్లు, ఆయుధాలు ఇందులో ఉంటాయి. ట్విన్ ఇంజన్ లైట్ హెలికాప్టర్, ఐదు హై స్పీడ్ బోట్ లను మోసుకు వెళ్లే ఈ షిప్ తీర ప్రాంత రక్షణకు ఉపయోగపడనుందని అధికారులు వెల్లడించారు. 2,450 టన్నుల బరువుతో ఉండే షిప్ 9100 కిలోవాట్ డీజిల్ ఇంజన్ తో గరిష్ఠంగా 23 నాట్ల వేగంతో ప్రయాణిస్తూ, ఒకసారి సముద్రంలోకి వెళితే 6 వేల నాటికల్ మైళ్లు ఆగకుండా ప్రయాణించగలుగుతుంది.