: ఉత్తర కొరియావాసులు ఇక నోరు మూసుకుని కూర్చోవాల్సిందే.. లేదంటే చర్యలు తప్పవంటున్న అధికారులు!


ఉత్తర కొరియా ప్రజలు ఇక నోరెత్తలేరు. దేశంలో ఏం జరిగినా మౌనంగా భరిస్తూ ఉండాల్సిందే. ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు వ్యతిరేకంగా ఎవరైనా వెటకారంగా మాట్లాడినా, పరోక్షంగా విమర్శించినా ఇక జైలుకు వెళ్లక తప్పదు. ఈ విషయాన్ని నార్త్ కొరియా అధికారులు రేడియో ఫ్రీ ఆసియా(ఆర్ఎఫ్ఏ) ద్వారా తెలిపారు. అంతేకాదు ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు గత నెల చివరి నుంచి పెద్ద ఎత్తున మీటింగ్‌లు కూడా నిర్వహిస్తున్నారు. భద్రతాధికారి ఒకరు ఈ సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అధినేత జోంగ్‌కు వ్యతిరేకంగా పల్లెత్తు మాట అనవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ సమావేశాల ఉద్దేశం ‘నోర్మూసుకుని కూర్చోమని’’ అని అర్థమని ఓ అధికారి పేర్కొన్నారు. దేశంలో ఏం జరిగినా ‘‘అదంతా అమెరికా తప్పే’’, ‘‘ఒక అవివేకి బయట ప్రపంచాన్ని చూడలేడు’’ తదితర వ్యంగ్యాలు ఇటీవల ఆ దేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇవి కాస్తా దేశాధ్యక్షుడికి చేరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడినా, కామెంట్లు చేసినా కష్టాలు కొనితెచ్చుకున్నట్టేనన్నమాట!

  • Loading...

More Telugu News