: ‘హోదా’ లేన‌ట్లే.. హోదాపై ర‌గడ చేసేవారు చ‌ట్టాన్ని, నియమాల‌ను క్షుణ్ణంగా చ‌ద‌వాలి: వెంకయ్య‌నాయుడు


ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై ర‌గడ చేసేవారు చ‌ట్టాన్ని, నియమాల‌ను క్షుణ్ణంగా చ‌ద‌వాలని కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు సూచించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా, ఆర్థిక సాయం అంశంపై ఈరోజు ఢిల్లీలో ఆయ‌న మాట్లాడుతూ.. హోదా ఇచ్చే ప్రక్రియ‌ ఇప్పుడు లేనందునే నిధులు ఇస్తున్నారని స్ప‌ష్టం చేశారు. విద్యాసంస్థ‌లు, ప‌రిశ్ర‌మ‌లు ఇవ్వాల‌ని తాను విభ‌జ‌న స‌మయంలోనే ప‌ట్టుబ‌ట్టిన‌ట్లు వెంకయ్య‌ పేర్కొన్నారు. విభ‌జ‌న చ‌ట్టంలో వాడిన భాష కూడా రాష్ట్రానికి ఇబ్బందిగా మారిందని ఆయ‌న తెలిపారు. వెనుక‌బ‌డిన జిల్లాల‌కు రూ. 700 కోట్లు ఇచ్చిన‌ట్లు వెంక‌య్య పేర్కొన్నారు. హోదాకు ఆర్థిక సంఘం సిఫార్సులు అనుకూలంగా లేవని ఆయ‌న అన్నారు. హోదా ఇచ్చే అవ‌కాశం లేన‌ప్పుడు ప్యాకేజీ ఇవ్వాల‌ని తాను కోరిన‌ట్లు తెలిపారు. పోల‌వ‌రం ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో ముఖ్యమ‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రాన్ని విభ‌జన చేసినవారే ఇప్పుడు మోదీ దిష్టిబొమ్మ‌లు ద‌హ‌నం చేస్తున్నారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైల్వేజోన్ ఇవ్వాల‌ని కేంద్రం ఆలోచిస్తోంది, అయితే విశాఖ, విజ‌య‌వాడ అంటూ బయట గంద‌ర‌గోళం చేస్తున్నారని ఆయ‌న అన్నారు. రైల్వే జోన్‌పై ప్ర‌భుత్వం స్ప‌ష్టమైన ప‌రిశీల‌న చేస్తోందని, దానిపై ప్ర‌క‌ట‌న రాకముందే ఆందోళ‌న‌ ఎందుకని అన్నారు. అసలు దేశంలో ఇన్ని ప్రాజెక్టులు ఏ రాష్ట్రానికి రాలేదని వెంకయ్య తెలిపారు. రాష్ట్రంపై ప్ర‌త్యేక దృష్టితోనే విజ‌య‌వాడ మెట్రోకు గ్రీన్ సిగ్న‌లిచ్చిన‌ట్లు తెలిపారు. ఇంత భారీ ప్యాకేజీని కేంద్రం ఏ రాష్ట్రానికీ ఇవ్వ‌లేదని అన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ప్రారంభ‌మై 34 ఏళ్లు పూర్త‌యింద‌ని, మూడేళ్ల‌లో ప్రాజెక్టు పూర్తి కావాల‌ని ఇప్పుడు మాట్లాడుతున్న‌వారు అప్పుడేం చేశార‌ని ఆయన ప్రశ్నించారు. పోల‌వ‌రం నిధుల కేటాయింపుపై చ‌ట్ట‌బ‌ద్ధ‌త కూడా వ‌స్తోందని అన్నారు. కేంద్రం నిర్మిస్తే ఆల‌స్యం అవుతుంద‌నే పోల‌వ‌రం నిర్మాణ బాధ్య‌త రాష్ట్రానికి అప్ప‌గించిన‌ట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును ఏపీకి జీవనాధారగా ఆయన అభివర్ణించారు. హుద్ హుద్ తుపాను సంభవించిన సమయంలో కేంద్రం ఏపీకి రూ.650 కోట్లు ఇచ్చిందని వెంకయ్య అన్నారు. 20 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న నంధ్యాల-ఎర్రగుంట్ల రైల్వే మార్గాన్ని తామే పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. రాష్ట్రానికి చేయాల్సిన సాయం చేస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఏ రాష్ట్రానికీ హోదా ఇచ్చే అవకాశం లేదని ఆయన అన్నారు. అన్ని అంశాలను పరిశీలించాకే తాము ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News