: చంద్రబాబు ఎప్పటిలాగే మరోసారి వెన్నుపోటు పొడిచారు: వైఎస్సార్సీపీ నేత కోటంరెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ గుండెలపై పొడిస్తే, సీఎం చంద్రబాబు మాత్రం ఎప్పటిలాగే మరోసారి వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్సీపీ నేత కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఏపీ అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదాపై రెండేళ్లు ఎదురుచూసేలా చేసి కేంద్రం మోసం చేసిందన్నారు. ఏపీలో ప్రతిఒక్కరూ ప్రత్యేకహోదా కోరుకుంటున్నారని, హోదా విషయమై కేంద్రం తెగేసి చెప్పినా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని రెండు నెలల నుంచే కేంద్రం చెబుతోందని, ఈ ప్రకటనలు వింటుంటే తన రక్తం మరుగుతోందని నాడు చంద్రబాబు చెప్పారని, ఇప్పుడు ఆయన రక్తం మరగట్లేదా? అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు.