: అర్ధరాత్రి డ్రామాలాడతారా.. ఆంధ్రప్రజల గుండెలు మండుతున్నాయి: సీపీఐ రామకృష్ణ
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించే క్రమంలో ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. విజయవాడలో నిర్వహించిన ఆందోళనలో సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 'హోదా, ప్యాకేజీ అంటూ నిన్న అర్ధరాత్రి డ్రామా లాడుతారా.. ఆంధ్రప్రజల గుండెలు మండుతున్నాయి' అని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఉద్ఘాటించారు. హోదా కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని రామకృష్ణ స్పష్టం చేశారు. తెలుగు ప్రజల దృష్టిలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మోసగాడిలా మిగిలిపోతారని ఆయన అన్నారు. పార్లమెంటుతో పాటు అనేక సభల్లో ఆనాడు ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడిన వెంకయ్యనాయుడు నేడు నీచంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. వెంకయ్య చరిత్రహీనుడుగా మిగిలిపోతారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అస్పష్టమైన ప్రకటనలు చేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతోందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఏకమై హోదా సాధించాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఖరి బయటపడిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రజల్లో ఆగ్రహం నిండుకుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వాల తీరుకి నిరసనగా ఈ నెల 10న రాష్ట్ర బంద్‌ను పాటించి తీరుతామని స్పష్టం చేశారు. పోలీసులను ప్రయోగించి తమని అడ్డుకోలేరని ఆయన అన్నారు.