: ఆ గ్రామస్తుల 'నిండు నూరేళ్ల' ఆరోగ్యం గుట్టు తెలిసింది
నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించు అంటూ పెద్దలు దీవించడం వినే ఉంటారు. ఎవరి ఆశీర్వచన ఫలమో గానీ ఆ గ్రామంలోని వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఇటలీ దక్షిణ తీర ప్రాంతంలోని అకియోరోలీ గ్రామస్తుల ఆరోగ్య రహస్యం గురించి ఆరు నెలల పాటు తలలు బద్దలు కొట్టుకున్న శాస్త్రవేత్తలు ఎట్టకేలకు ఆ గుట్టు పట్టుకున్నారు. అకియోరోలీ గ్రామ జనాభా 800 మంది. వీరిలో ఎక్కువ మంది వృద్ధులే. ప్రతి పది మందిలో 100 ఏళ్లు దాటిన వారు ఇద్దరు ఉన్నారు. 80 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు కూడా ఎక్కువే. ఇంత వయసు వచ్చినా చక్కని ఆరోగ్యంతో ఉండడానికి కారణం ఔషధ గుణాలతో కూడిన మొక్కలకు ఆ ప్రాంతం ఆలవాలంగా ఉండడమే. అంతేకాదు, ఈ గ్రామస్తులు అనుసరించే కష్టే ఫలి అన్న సూత్రం కూడా చక్కని ఆరోగ్యానికి తోడ్పడుతున్నట్టు శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో భాగంగా గుర్తించారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి సాయంత్రం వరకు శారీరకంగా కష్టపడుతుంటారు. ఎలాంటి కాలుష్య ప్రభావం లేకుండా, పురుగు మందుల అవసరం లేకుండా సహజ సిద్ధంగా స్వయంగా సాగు చేసుకున్న వాటిని తినడం వల్ల వారి ఆరోగ్యం నిక్షేపంగా ఉంటోందని తెలిసింది.