: ప్రయాణికులకు దడ పుట్టిస్తున్న ‘ఓలా’.. ముంబై నుంచి పుణెకు రూ.83 వేలు బిల్లు!
ఓలా క్యాబ్.. ఇప్పుడీ పేరు వింటేనే చాలు, ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. పొరపాటున కూడా ఆవైపు చూసేందుకు జంకుతున్నారు. కొన్ని కిలోమీటర్ల దూరానికి వేలల్లో చూపిస్తున్న బిల్లును చూసి ప్రయాణికులు గుండెలు బాదుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్న రతీశ్ శేఖర్ అనే వ్యక్తికి ఏకంగా రూ.9.15 లక్షల బిల్లు వచ్చింది. హైదరాబాద్‌లోనూ ఇటువంటి సంఘటనలు వెలుగుచూశాయి. తాజాగా ఇటువంటి ఘటనే మహారాష్ట్రలోని కమల్ భాటియా అనే వ్యాపారవేత్తకు ఎదురైంది. వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో కలిసి పుణె వెళ్లేందుకు ఆయన ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. పుణె చేరుకున్నాక బిల్ చూసిన ఆయన గుండె గుభేల్‌మంది. గంటకు 500 కిలోమీటర్ల వేగంతో 14 గంటల్లో 7వేల కిలోమీటర్లు ప్రయాణించినందుకుగాను రూ.83,395 అయినట్టు బిల్లు చూపించింది. అంతే కమల్ హతాశుడయ్యారు. బిల్లుపై డ్రైవర్‌ను ప్రశ్నించడంతో సాఫ్ట్‌వేర్ సమస్యగా భావించి కాల్ సెంటర్‌తో మాట్లాడి అసలు బిల్లు రూ.4,088 అని చెప్పి క్షమాపణలు చెప్పాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న కమల్ ఆ డబ్బులు చెల్లించి అక్కడి నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనపై స్పందించేందుకు ఓలా యాజమాన్యం నిరాకరించింది.