: 2019 వరకు టెస్టుల్లో టూటైర్ సిస్టమ్ అమలు కాదు: ఐసీసీ


ఐసీసీ అధికారిక సమావేశాలు దుబాయ్‌ లో ప్రారంభమయ్యాయి. టెస్టుల్లో టూటైర్ సిస్టమ్ అమలు చేయాలంటూ వివిధ దేశాల క్రికెట్ బోర్డులు విజ్ఞప్తులు చేయడంతో, దీనిపై సుదీర్ఘ చర్చ జరిగింది. టూటైర్ సిస్టమ్ అంటే ప్రస్తుతం క్రికెటర్లకు ఇస్తున్న వేతనాల్లో అమలవుతున్న గ్రేడింగ్ సిస్టమ్ వంటిది. టెస్టు క్రికెట్ ఆడే జట్లను రెండు భాగాలుగా విభజిస్తారు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ 7 ర్యాంకుల్లో ఉన్న జట్లు టైర్-1 కేటగిరీలోనూ, 8, 9, 10, 11, 12 జట్లు టైర్-2 కేటగిరీలోనూ ఉంటాయి. దీంతో వారి అర్హతకు తగ్గట్టే ఆ జట్లకు చెల్లింపులు కూడా ఉంటాయి. ఈ సిస్టమ్ లో టైర్-1లో ఉన్న జట్లతో టైర్-2లో ఉన్న జట్లు ఆడే అవకాశం ఉండదు. దీంతో ఈ విధానాన్ని బీసీసీఐ వ్యతిరేకిస్తోంది. క్రికెట్ ను కేవలం వ్యాపార వస్తువుగా చూడవద్దని, ఆటను విస్తరించాలంటే ఇలాంటి నిబంధనలు అడ్డంకిగా మారతాయని వాదిస్తోంది. దీంతో బీసీసీఐ వాదనను ఐసీసీ అంగీకరించింది. పర్యవసానంగా 2019 వరకు టెస్టుల్లో టూ టైర్ సిస్టమ్ అమలు చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది. దీంతో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు ఈ టూ టైర్ సిస్టమ్‌ ను వ్యతిరేకిస్తున్నాయి.

  • Loading...

More Telugu News