: ఐఎస్ఐఎస్ పత్రికలో లండన్ వాసి ఫోటో... పోలీసుల ఫోన్ కాల్ తో వణికిపోయిన వైనం!
ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రచారం కోసం నడిపించే పత్రిక 'రుమియా'లో వాయవ్య ఇంగ్లండ్ లోని షెషైర్ ప్రాంతంలో పూల వ్యాపారి స్టీఫెన్ లేలండ్ (64) ఫొటో ప్రత్యక్షమైంది. పాశ్చాత్య దేశాలలో ఇలాంటి వ్యక్తుల మీద గుంటనక్క దాడులు జరుగుతున్నాయంటూ ఇచ్చిన కథనంలో అతడి ఫొటో ప్రచురించారు. ఐఎస్ఐఎస్ కదలికలపై ఓ కన్నేసి ఉంచిన కౌంటర్ టెర్రరిజం అధికారులు వెంటనే అతనికి ఫోన్ చేశారు. ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ ప్రసారం చేసే 'రుమియా' పత్రికలో నీ పేరు ఎందుకు వచ్చింది? వారితో నీకున్న సంబంధాలు ఏంటి? అని అడిగారు. దీంతో బిక్కచచ్చిన స్టీఫెన్ లేలండ్...వారితో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, వారు ఆ పత్రికలో తన ఫోటో ఎందుకు అచ్చువేశారో తెలియదని, అసలు తన ఫోటో వారిదగ్గరకు ఎలా వెళ్లిందో కూడా తెలియదని వివరణ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలీసులు ఫోన్ చేయగానే తనకు కాళ్లు, చేతులు వణికిపోయాయని, ఏం చేయాలో తెలియలేదని, తన ఫోటో అలాంటి పత్రికలో వచ్చిందని తెలియగానే చాలా భయపడ్డానని అన్నారు. తనకు జీహాదీలతో ఎలాంటి పరిచయం లేదని ఆయన తెలిపారు.