: ఆగిన పరుగు... స్టాక్ మార్కెట్లో లాభాల స్వీకరణ!
గత కొన్ని సెషన్లుగా భారీ లాభాలతో దూసుకొచ్చిన స్టాక్ మార్కెట్లో నేడు అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సెషన్ ఆరంభంలో లాభాలు నమోదైనప్పటికీ, ఆపై మాత్రం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, దేశవాళీ ఫండ్ సంస్థలు, ఇటీవలి మార్కెట్ పెరుగుదలను లాభంగా మార్చుకునేందుకు కదిలాయి. ఈ క్రమంలో పలు కంపెనీల ఈక్విటీలను విక్రయించేందుకే ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీంతో పలుమార్లు లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన బెంచ్ మార్క్ సూచికలు, చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ సూచి 29 వేల మార్క్ నుండి దిగువన, నిఫ్టీ 8,950 పాయింట్ల దిగువన కొనసాగాయి. బుధవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 51.66 పాయింట్లు పడిపోయి 0.18 శాతం నష్టంతో 28,926.36 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 25.05 పాయింట్లు పడిపోయి 0.28 శాతం నష్టంతో 8,917.95 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 1.11 శాతం నష్టపోగా, స్మాల్ కాప్ 0.41 శాతం లాభపడింది. ఇక ఎన్ఎస్ఈ-50లో 20 కంపెనీలు లాభపడ్డాయి. బీహెచ్ఈఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓఎన్జీసీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, యస్ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్, గెయిల్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,917 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,406 కంపెనీలు లాభాలను, 1,353 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 1,12,48,532 కోట్లుగా నమోదైంది.