: మునిసి‘పోల్స్’ వేళ ఈ గొడవలేంటి?... విశాఖ, ‘తూర్పు’ జిల్లాల నేతలకు వైఎస్ జగన్ క్లాస్!
నిన్న హైదరాబాదులోని వైసీపీ కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ కీలక భేటీలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చాటే దిశగా వ్యూహ రచన కోసమే జరిగిన ఆ సమావేశంలో ఆయా జిల్లాలకు చెందిన పార్టీ శ్రేణుల మధ్య నెలకొన్న విభేదాలపై ఆయన ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో నేతల మధ్య పొడచూపిన విభేదాలపై ఆయన మండిపడ్డారు. మునిసిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ గొడవలేంటంటూ ఆయన సదరు జిల్లాల నేతలను నిలదీశారు. అంతర్గత కుమ్ములాటలు ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తాయని హెచ్చరించిన జగన్... తక్షణమే సదరు గొడవలకు చెక్ పెట్టి కలిసికట్టుగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. విభేదాలు పక్కన పెట్టని నేతలను ఉపేక్షించేది లేదని కూడా ఆయన కాస్తంత ఘాటుగానే హెచ్చరించారు.