: ఇంటికి చేరిన ‘విమాన బాలిక’.. 20 రోజుల చికిత్స తర్వాత తల్లికి అప్పగింత
ఆగస్టు 14న దుబాయ్ నుంచి మనీలా వెళ్తున్న సెబు పసిఫిక్ విమానంలో ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ గర్భిణి ప్రసవించిన సంగతి తెలిసిందే. అప్పటికి విమానం భారత గగనతలంపై ఎగురుతోంది. శిశువుకు అత్యవసర వైద్య సాయం అవసరంతో విమానాన్ని అత్యవసరంగా హైదరాబాద్‌కు మళ్లించి శిశువును వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆకాశంలోనే జన్మించడంతో పాపను ‘హెవెన్’ అని పిలుస్తున్నారు. ఆస్పత్రికి చేరిన అనంతరం వైద్యులు ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడారు. 20 రోజుల తర్వాత శిశువు పూర్తిగా కోలుకోవడంతో మంగళవారం ఆ చిన్నారిని తల్లి హాలీడే(33)కి అందించారు. కుమార్తె తిరిగి తన చెంతకు చేరడంతో సంతోషంతో పొంగిపోయిన ఆ తల్లి మాట్లాడుతూ తన కుమార్తె బతుకుతుందన్న నమ్మకం తనకుందని పేర్కొన్నారు. డెలివరీ సమయానికి ముందే అంటే 32 వారాలకే ఆమె ప్రసవించింది. బిడ్డ జన్మించినప్పుడు బరువు 1.6 కేజీలు. దీంతో శిశువు బతికి బట్టకట్టడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరికి అపోలో వైద్యుల చొరవతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడి తల్లి ఒడికిచేరింది. ఇప్పుడు స్వదేశం వెళ్లేందుకు సిద్ధమైంది.