: హైదరాబాద్, విజయవాడ రైల్వే మార్గంలో భారీ మార్పులు... 241 రైళ్లు రద్దు, దారిమళ్లనున్న 215 రైళ్లు!


నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతానికి ప్రధాన రైల్వే స్టేషన్ గా ఉన్న విజయవాడ రైల్వేస్టేషన్ లో కేంద్రీకృత సిగ్నలింగ్ వ్యవస్థ (రూట్ రిలే ఇంటర్‌ లాకింగ్ సిస్టమ్)ను అత్యాధునికీకరణ చేయాలని తలపెట్టిన రైల్వే శాఖ, ఆ పనులు పూర్తయ్యే వరకూ 214 రైళ్లను పూర్తిగా, 361 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తూ, 215 రైళ్లను దారి మళ్లించాలని నిర్ణయించింది. ఈ మార్పులు 20 నుంచి 28 రోజుల పాటు విజయవాడ మీదుగా వెళ్లే అన్ని రైళ్లకూ వర్తిస్తాయి. అత్యంత బిజీగా ఉండే సికింద్రాబాద్ - కాజీపేట్ మీదుగా విజయవాడ వైపు వెళ్లే రైళ్లు సైతం నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణ తేదీలు, మార్గాలలో సవరణలు చేసుకోవడం మంచిదని దక్షిణ మధ్య రైల్వే సూచిస్తోంది. హైదరాబాద్ - హౌరా మధ్య నడిచే ఈస్ట్‌ కోస్ట్ ఎక్స్‌ ప్రెస్, న్యూఢిల్లీ - విశాఖ మధ్య ప్రయాణించే ఏపీ ఎక్స్‌ ప్రెస్, సాయినగర్- కాకినాడ ఎక్స్‌ ప్రెస్‌లు ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు విజయవాడ స్టేషన్‌ కు వెళ్లకుండా, బైపాస్ రైల్వే లైన్, కొండపల్లి స్టేషన్‌ ల మీదుగా వెళతాయి. ఆదిలాబాద్ నుంచి సికింద్రాబాద్ మీదుగా తిరుపతికి వెళ్లే కృష్ణా ఎక్స్‌ ప్రెస్ భువనగిరి, కాజీపేట్, ఖమ్మం, విజయవాడ మార్గంలో కాకుండా పగిడిపల్లి, గుంటూరు, తెనాలి స్టేషన్‌ ల మీదుగా నడుస్తుంది. ఇదే సమయంలో ముంబై సీఎస్‌టీ - భువనేశ్వర్ మధ్య సికింద్రాబాద్ మీదుగా నడిచే కోణార్క్ ఎక్స్‌ ప్రెస్ ను కొండపల్లి, విజయవాడ బైపాస్ మార్గంలో మళ్లించనున్నారు. పాట్నా - బెంగళూరు మధ్య నడిచే సంఘమిత్ర ఎక్స్‌ ప్రెస్, దర్భంగ - మైసూర్ బాగమతి ఎక్స్‌ ప్రెస్, జమ్ముతావి - చెన్నై సెంట్రల్ మధ్య నడిచే అండమాన్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లు, వరంగల్, విజయవాడ, నెల్లూరు, గూడూరు మార్గానికి బదులు, బల్లార్ష, వరంగల్, కాచిగూడ, డోన్, గుత్తి, రేణిగుంట మార్గంలో నడుస్తాయి. సికింద్రాబాద్ - గుంటూరు మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ ప్రెస్, సికింద్రాబాద్ - గూడూరు సింహపురి ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లు, కాజీపేట్ మార్గంలో కాకుండా గుంటూరు, నడికుడి, నల్గొండ మీదుగా నడుస్తాయి. నర్సాపూర్ - నాగర్‌సోల్, విశాఖపట్టణం - హజ్రత్ నిజాముద్దీన్, సికింద్రాబాద్ - మచిలీపట్నం, కాకినాడ - బెంగళూర్, హైదరాబాద్ - విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ ప్రెస్, సికింద్రాబాద్ - కాకినాడ గౌతమి ఎక్స్‌ ప్రెస్, సికింద్రాబాద్ - విశాఖ దురంతో ఎక్స్‌ ప్రెస్, సికింద్రాబాద్ - విశాఖ గరీభ్ రథ్, సికింద్రాబాద్ - కాకినాడ మధ్య నడిచే కాకినాడ ఎక్స్‌ ప్రెస్, ముంబై లోకమాన్య తిలక్ - విశాఖ ఎక్స్‌ ప్రెస్, సికింద్రాబాద్ - కోల్‌కత్తా షాలిమార్ ఎక్స్‌ ప్రెస్, సికింద్రాబాద్ - విశాఖ జన్మభూమి ఎక్స్‌ ప్రెస్, సికింద్రాబాద్ - గువాహటి, సికింద్రాబాద్ - తిరుపతి పద్మావతి ఎక్స్‌ ప్రెస్ తదితర రైళ్లను విజయవాడ - కొండపల్లి బైపాస్ మార్గంలో, గుడివాడ - విజయవాడ బైపాస్ మార్గంలో నడుపుతారు. ఈ రైళ్లేవీ విజయవాడ జంక్షన్ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగించవు.

  • Loading...

More Telugu News