: రూ.25 లక్షలిస్తే రూ.10 వేల కోట్లు తెస్తారట!... 'వైఎస్ జమానా' పేరిట బెజవాడలో నయా దందా!
ఇటీవల హైదరాబాదులో బురిడీ బాబా ఓ రియల్టర్ ను బోల్తా కొట్టించిన వైనం ఇంకా మరువనే లేదు... అప్పుడే ఏపీ పొలిటికల్ కేపిటల్ విజయవాడలో మరో బురిడీ వ్యవహారం వెలుగు చూసింది. అయితే హైదరాబాదులో మాదిరిగా... బెజవాడ దందాలో డబ్బు చేతులు మారకముందే బురిడీరాయుళ్లు పోలీసులకు పట్టుబడిపోయారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో భారీ అవినీతి చోటుచేసుకుందన్న కథనాలనే పెట్టుబడిగా పెట్టిన ఈ దందా పెను కలకలమే రేపుతోంది. వివరాల్లోకెళితే... వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాము రూ.10 వేల కోట్లు వెనకేశామని ప్రచారం చేసుకుంటూ ఓ ముఠా రంగంలోకి దిగింది. సదరు భారీ నిధిని భద్రంగా నేలమాళిగలో దాచామని ఆ ముఠా చెప్పింది. సదరు నిధి చుట్టూ బాంబులు పెట్టామని, ఇతరులు దాని మీద చేయి పెట్టకుండా ఉండేందుకే ఆ బాంబులను అమర్చామని కట్టుకథ అల్లింది. సదరు బాంబులను నిర్వీర్యం చేసేందుకు ఎంత లేదన్నా రూ.25 లక్షల మేర ఖర్చవుతుందని తెలిపింది. ఇదే విషయాన్ని చిన్నగా డబ్బున్న ప్రముఖుల చెవిన వేస్తూ ముందుకు సాగింది. ఈ క్రమంలో సదరు ముఠా సభ్యులు నగరంలోని టైమ్ ఆసుపత్రి ఎండీ మైనేని హేమంత్ ను సంప్రదించారు. బాంబులు తీసేందుకు అవసరమయ్యే రూ.25 లక్షలిస్తే... రూ.10 వేల కోట్ల నిధిలో వాటా ఇస్తామని ఆయనకు చెప్పారు. అనుమానం వచ్చిన హేమంత్ ఓ తెలుగు టీవీ ఛానెల్ కు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన సదరు ఛానెల్ ప్రతినిధులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో హేమంత్ ను కలిసేందుకు వచ్చిన విజయ్ కుమార్, రాజేశ్, శ్రీనివాసరావు అనే ముగ్గురు వ్యక్తులను పెనమలూరు పోలీసులు పట్టేశారు. ఇక హేమంత్ కు ఫోన్ చేసిన వ్యక్తిని రవిగా గుర్తించారు. వీరంతా ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ ముఠాలోని సూత్రధారుల కోసం పోలీసులు వేట మొదలెట్టారు.