: ఎమిరేట్స్ విమాన ప్రమాదానాకి కారణం ఇదే.. వెల్లడించిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక
గత నెలలో దుబాయ్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంపై విచారణ జరిపిన అధికారులు మంగళవారం దర్యాప్తు నివేదికను వెల్లడించారు. ఎమిరేట్స్ మూడు దశాబ్దాల చరిత్రలోనే ఘోర ప్రమాదంగా రికార్డులకెక్కిన ఈ ఘటనపై నెల రోజలు వ్యవధిలోనే దర్యాప్తును పూర్తిచేశారు. ల్యాండ్ అవుతున్న విమానాన్ని తిరిగి టేకాఫ్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక నివేదిక పేర్కొంది. ఆ సమయంలో విమానంలో ఉన్న 300 మంది ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడిన సంగతి తెలిసిందే. అయితే మంటలను అదుపు చేసే సమయంలో మాత్రం అగ్నిమాపక సిబ్బంది ఒకరు మృతి చెందారు. విమాన ప్రమాదంపై దర్యాప్తు జరిపిన పౌర విమానయాన అధికారులు 28 పేజీలతో సమగ్ర నివేదికను రూపొందించారు. ఫ్లైట్ డేటా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంభాషణ, విశ్లేషకుల ఇంటర్వ్యూలను ఇందులో పొందుపరిచారు. కేరళలోని తిరువనంతపురం నుంచి దుబాయ్ చేరుకున్న ఎమిరేట్స్‌కు చెందిన బోయింగ్ 777-300 విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించాడు. అయితే విమానం ముందు చక్రం తెరుచుకోకపోవడంతో అప్రమత్తమైన పైలట్ తిరిగి దానిని టేకాఫ్ చేసేందుకు ప్రయత్నించాడు. అప్పటికే ఆలస్యంకావడంతో గంటకు దాదాపు 230 కిలోమీటర్ల వేగంతో ఉన్న విమానం ముందు భాగం రన్‌వేను తాకి ముందుకు దూసుకెళ్లింది. దీంతో మంటలు అంటుకుని క్షణాల్లోనే దగ్ధమైంది.